మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న కుల రాజకీయాలు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి 2 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో స్థానిక రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రజాస్వామ్య పండుగలో అభివృద్ధి ప్రధాన అజెండాగా ఉండాల్సిన చోట, అభ్యర్థుల గెలుపోటములను కుల సమీకరణాలే శాసించేలా కనిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రతి వార్డులోనూ ఏ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయనే లెక్కలతో ప్రధాన రాజకీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీసీ సామాజిక వర్గాల ఓట్లు అత్యంత కీలకం. ముఖ్యంగా పద్మశాలి, యాదవ, మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్ ఓటర్లు ఎటు మొగ్గితే విజయం వారిని వరిస్తుందని పార్టీలు భావిస్తున్నాయి.
 అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆయా వార్డుల్లో సామాజిక వర్గాల బలాబలాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. వ్యక్తిగత ఇమేజ్ కంటే, కులపరమైన మద్దతు ఉన్న వారికే టికెట్ల కేటాయింపులో మొగ్గు చూపుతున్నాయి.
సమీకరణాల వేదికగా సంఘాలు: మున్సిపల్ ఎన్నికల వేళ కుల సంఘాల కార్యకలాపాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అభ్యర్థులు తమ కుల సంఘాల ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో డ్రైనేజీ, తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతులు చర్చకు రావాలి. కానీ, వర్ధన్నపేటలో పరిస్థితి భిన్నంగా ఉంది. నాయకులు తమ ప్రచారంలో అభివృద్ధి మంత్రం పఠిస్తున్నప్పటికీ, అంతర్గత సమావేశాల్లో మాత్రం కులాల వారీగా ఓట్లను చీల్చే వ్యూహాలకే పదును పెడుతున్నారు.
ప్రధాన పార్టీల ఎత్తుగడ: కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, తటస్థంగా ఉండే కులాల మద్దతు కూడగట్టేందుకు కుల పెద్దలతో రాయబారాలు నడుపుతున్నాయి.రాజకీయ చైతన్యం పెరిగిన ఈ కాలంలో కూడా కుల రాజకీయాలు ఎన్నికలను ప్రభావితం చేయడంపై మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యువ ఓటర్లు మాత్రం కులాలకు అతీతంగా అభివృద్ధికి పట్టం కట్టాలని కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ కుల రాజకీయాల సెగ అభ్యర్థుల జాతకాలను ఎలా మారుస్తుందో తెలియాలంటే పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే.