సర్వే సెగ తిరుగుబాటు జెండా ఎగురవేసిన రెబల్స్.. పార్టీల గుండెల్లో రైళ్లు

journalist vaartha
By -
వర్ధన్నపేట/ఫిబ్రవరి 2 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరి రోజు కావడంతో పట్టణంలో హైడ్రామా నడుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు అవలంబించిన సర్వేల వ్యూహం ఇప్పుడు ఆయా పార్టీలకే శాపంగా మారేలా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కేవలం సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు కేటాయించడంతో ఆశావాహులు భగ్గుమంటున్నారు.టికెట్ దక్కని కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల నేతలు స్వతంత్రులుగా బరిలో నిలవడంతో గెలుపు సమీకరణాలు తారుమారవుతున్నాయి. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు పార్టీల జిల్లా స్థాయి నేతలు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడితే, చివరి నిమిషంలో దగా చేస్తారా?" అంటూ రెబల్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న నేతలు స్వతంత్రులుగా పోటీలో ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నేడే మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.
తమ నాయకుడికి అన్యాయం జరిగిందని, ఈసారి గుణపాఠం తప్పదని రెబల్ అభ్యర్థుల అనుచరులు హెచ్చరిస్తున్నారు. చివరి నిమిషం వరకు రెబల్స్‌ను దారికి తెచ్చుకునేందుకు పార్టీలు పదవులు, ఇతర హామీలతో ప్రలోభపెడుతున్నాయి. వర్ధన్నపేటలోని కీలక వార్డుల్లో పార్టీ అభ్యర్థుల కంటే రెబల్ అభ్యర్థులకే కులపరమైన, వ్యక్తిగత మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది. వీరు చీల్చే ఓట్లు ఏ పార్టీని ముంచుతాయో, ఎవరిని తేల్చుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొత్తానికి సర్వేలతో మొదలైన టికెట్ల పంచాయితీ, ఇప్పుడు పార్టీల ఉనికికే సవాలుగా మారింది. ఉపసంహరణ పర్వం ముగిసిన తర్వాతే వర్ధన్నపేట మున్సిపల్ కురుక్షేత్రంలో అసలైన వీరులెవరో, దగా పడ్డ వారెవరో స్పష్టమైన చిత్రం రానుంది.