వర్ధన్నపేట/ఫిబ్రవరి5(జర్నలిస్ట్ వార్త);
అడ్డగోలు మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆయన అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం హెచ్చరించారు. గత పదేళ్ల అధికారంలో అక్రమ సంపాదన, కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని, అందుకే సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను ఓడించి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. లక్ష మెజారిటీ అని గొప్పలు చెప్పుకున్న అరూరిని ప్రజలు ఇంటికి పరిమితం చేసినా ఆయన తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామంలోనూ పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టని చరిత్ర అరూరిదని, నేడు నియోజకవర్గంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక అరూరి రమేష్ అర్థరహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను గాలికొదిలేసి కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పెద్దల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపిలో చేరి అక్కడ ఆదరణ లేక తిరిగి బీఆర్ఎస్‌లోకి వచ్చిన అరూరిది అవకాశవాద రాజకీయమని యాకాంతం విమర్శించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమని, అరూరి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని అడ్డగోలు మాటలు కట్టిపెట్టకపోతే, మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు.