వర్ధన్నపేట/ఫిబ్రవరి7(జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మున్సిపాలిటీ ఒకటవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పాపారావు గెలుపు ఖాయం మని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన్నె బాబురావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. గత 15 ఏళ్లుగా వర్ధన్నపేటను ఏలిన పాలకులకు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదని విమర్శించారు. గతంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కోల్పోయిన జాఫర్ గడ్డ, ఖమ్మం హైవే బాధితులకు అటు శ్రీధర్ గానీ, ఇటు అరూరి రమేష్ గానీ ఎలాంటి పరిహారం అందించకుండా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపాలిటీలో మునుపెన్నడూ లేని విధంగా కోర్టు, సబ్ జైలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వంద పడకల ఆసుపత్రి వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే కాంగ్రెస్ లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి తీరుతాంమని
మన్నె బాబురావు హామీ ఇచ్చారు.