భీమదేవరపల్లి/ఫిబ్రవరి5 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అక్రమ మద్యం దందాకు అడ్డాగా మారింది. బెల్టుషాపుల పేరిట సాగుతున్న ఈ అక్రమ వ్యాపారం ఇప్పుడు వ్యవస్థనే ఎగతాళి చేస్తోంది. చట్టం ఉందా లేదా అన్న సందేహం కలిగేలా, అధికారుల నిశ్శబ్దం మధ్య పేదల జీవితాలతో నిర్లక్ష్యంగా చెలగాటం సాగుతోంది.
మద్యం షాపులే దందాకు కేంద్రాలా?
ముల్కనూర్ గ్రామం అక్రమ మద్యం సరఫరాకు కేంద్ర బిందువుగా మారింది. మూడు మద్యం షాపులు ఉండగా, రెండు మాత్రమే అధికారికంగా తెరిచి ఉంచి అధికారులను మభ్యపెడుతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మూడో షాపు మాత్రం బెల్టుషాపులకు మద్యం తరలించే అక్రమ గోదాముగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి.
గ్రామగ్రామాన మద్యం వరద
ముల్కనూర్ నుంచి కొప్పూరు, మాణిక్యాపూర్, వంగర, రత్నగిరి, రంగయ్యపల్లి, భీమదేవరపల్లి, గట్లనర్సింగాపూర్, రాంనగర్, కొత్తపల్లి తదితర గ్రామాలకు మద్యం సరఫరా అవుతోంది. ఎక్కడా తనిఖీలు లేవు. అడ్డుకట్ట లేదు. చట్టం నిద్రలో ఉంటే దందా మేల్కొనడం సహజమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సీసాపై రూ.60 నుంచి రూ.100 దోపిడీ
పేదల చెమటపై బంగారం కరిగిస్తున్నారా?
ప్రభుత్వ ధరల మాటేమో గానీ, బెల్టుషాపుల్లో ఒక్కో సీసాపై అదనంగా రూ.40 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. రోజువారీ కూలీలు, రైతులు ఈ దోపిడీకి బలవుతున్నారు. మద్యం మత్తులో కుటుంబాలు అప్పులపాలై, ఇంటి గడప దాటని దుఃఖాలు గ్రామాల్లో పేరుకుపోతున్నాయి.
కూలిపోతున్న కుటుంబాలు… కదలని వ్యవస్థ
బెల్టుషాపులు బహిరంగంగా నడుస్తున్నా, వాటిని అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఈ మౌనం వెనుక ఏం ఉంది? ఎవరి రక్షణలో ఈ అక్రమ దందా సాగుతోంది? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.
మద్యం మత్తులో పెరుగుతున్న నేరాలు
అక్రమ మద్యం విక్రయాల వల్ల కుటుంబ కలహాలు, ఆర్థిక పతనం, నేరప్రవృత్తి పెరుగుతున్నాయి. గ్రామాల సామాజిక నిర్మాణం క్రమంగా కూలిపోతున్నా, బాధ్యత వహించాల్సిన వ్యవస్థ మాత్రం చేతులు దులుపుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇకైనా ఉక్కుపాదం మోపకపోతే… ప్రజాగ్రహమే!
మండలవ్యాప్తంగా బెల్టుషాపులను మూసివేసి, అక్రమ మద్యం సరఫరా కేంద్రాలను పూర్తిగా నిర్మూలించాలని భీమదేవరపల్లి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిస్తున్నారు.