వర్ధన్నపేట/ఫిబ్రవరి1(జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. నామినేషన్ల ఘట్టం ముగిసి, ఉపసంహరణ ప్రక్రియ ఊపందుకోవడంతో నియోజకవర్గ కేంద్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ నుండి ఆశావహులు భారీగా నామినేషన్లు దాఖలు చేయడంతో, ఇప్పుడు అసలైన అభ్యర్థులెవరో తేల్చడం పార్టీ అధిష్టానాలకు కత్తిమీద సాములా మారింది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి, అటు పట్టు నిరూపించుకోవాలనుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ లకు ప్రతిష్టాత్మకంగా సవాల్‌గా మారింది.
ముఖ్యంగా బి-ఫామ్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అటు అభ్యర్థుల్లో, ఇటు క్యాడర్‌లో నెలకొంది. ప్రతి వార్డులోనూ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు తమకే పార్టీ గుర్తు కేటాయిస్తారని ధీమాతో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న మాకే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం వాదిస్తుంటే, గెలిచే అవకాశాలు ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ క్రమంలో అసమ్మతి రాగాలు వినిపిస్తుండటంతో, రెబల్ అభ్యర్థులను దారికి తెచ్చుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు నేరుగా రంగంలోకి దిగారు. వర్ధన్నపేట తాజా ఎమ్మెల్యే నాగరాజు (v s) మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లకు. ప్రతిష్టాత్మక పోరు
ఈ ఎన్నికలు .ఇద్దరు కీలక నేతల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు: మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. తన నియోజకవర్గంలో పట్టు కోల్పోలేదని నిరూపించుకోవడానికి ఆయన ప్రతి వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే
ఆరూరి రమేష్, ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నారు. బిఆర్ఎస్ క్యాడర్ చెల్లాచెదురు కాకుండా, అసంతృప్తి నేతలను బుజ్జగించి ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. టికెట్ దక్కని పక్షంలో స్వతంత్రులుగా బరిలోకి దిగుతామని కొందరు ఆశావహులు హెచ్చరిస్తుండటంతో నేతలు వెనక్కి తగ్గాల్సి వస్తోంది. భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తామని, పార్టీ గెలుపుకు సహకరించాలని నేతలు బుజ్జగిస్తున్నారు. విత్ డ్రా గడువు ముగిసిన తర్వాతే అసలైన అభ్యర్థుల సంఖ్యపై క్లారిటీ రానుంది. అప్పటి వరకు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలతో వర్ధన్నపేట రాజకీయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.