పసిబిడ్డను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలిడాక్ట‌ర్ మధుపాక ఎల్లయ్య డిమాండ్

journalist vaartha
By -
హనుమకొండ/మార్చి 1(జర్నలిస్ట్ వార్త);
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కుల దురహంకారంతో రెండు నెలల పసిబిడ్డను తన్ని చంపిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మధుపాక ఎల్లయ్య తీవ్రంగా ఖండించారు. ఆదివారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కుమ్మెర గ్రామానికి చెందిన బీసీ (చాకలి) సామాజిక వర్గానికి చెందిన గణేష్-చంద్రకళ దంపతులు తమ రెండు నెలల పసిబిడ్డతో కలిసి స్థానిక గుడికి వెళ్లగా, ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, అతని అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, మధు రెడ్డిలు కుల వివక్షతో వారిపై దాడి చేశారని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పసిబిడ్డను తన్నడంతో ఆ చిన్నారి మరణించడం అత్యంత కిరాతకమని ఆయన పేర్కొన్నారు. పసిబిడ్డ మరణానికి కారణమైన నిందితులపై తక్షణమే హత్య కేసు నమోదు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి.
ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం, రక్షణ కల్పించాలి.
నిర్లక్ష్యం వద్దు: కేసు విషయంలో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని హెచ్చరించారు. రాష్ట్రంలో అంటరానితనం, కుల వివక్ష ఇంకా వేళ్లూనుకుని ఉండటం దారుణమని, ప్రభుత్వం కుల నిర్మూలన దిశగా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
"రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలకు, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఆధిపత్య వర్గాల ఆగడాలు అరికట్టకుంటే ప్రజా సంఘాల పోరాటం చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏనుట్ల రవీందర్, అంబేద్కర్ యువజన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మాంకాల యాదగిరి, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు బూజుగుండ్ల శ్రీనివాస్, సింగారపు ఐలయ్య, జిల్లా కార్యదర్శి రేణిగుంట్ల దుర్గాప్రసాద్, మహిళా విభాగం కన్వీనర్ భాస్కుల శోభారాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.