బయ్యారం/మార్చి 4 (జర్నలిస్ట్ వార్త):
మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఓ సర్పంచ్ వీరంగం సృష్టించారు. తను అడిగిన బ్రాండ్ బీరు లేదని చెప్పినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్, వైన్ షాపు కౌంటర్లో ఉన్న ఉద్యోగిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..?
జగ్గుతండా పంచాయతీ పరిధిలోని కనకదుర్గ వైన్ షాపులో బత్తుల గోపి కౌంటర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన సర్పంచ్ షాపుకు వచ్చి ఓ నిర్దిష్ట కంపెనీకి చెందిన బీరు బాటిల్ కావాలని అడిగారు. అయితే, సదరు కంపెనీ స్టాక్ లేదని, ఇతర కంపెనీల బీర్లు అందుబాటులో ఉన్నాయని గోపి బదులిచ్చారు.
దీంతో ఆగ్రహానికి గురైన సర్పంచ్.. నేను అడిగిన బీరు ఎందుకు లేదు? అంటూ ఇష్టానుసారంగా బూతులు తిడుతూ కౌంటర్ లోపలికి దూరి గోపిపై దాడి చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో షాపులో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు.
విధి నిర్వహణలో ఉన్న తనపై అకారణంగా దాడి చేసి, దుర్భాషలాడిన సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు గోపి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు, వైన్ షాపు యాజమాన్యం తెలిపారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సామాన్య ఉద్యోగిపై దాడికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.