నర్సంపేట /మార్చి 15(జర్నలిస్ట్ వార్త);
నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రముఖ యువ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికంగా ఎంతో గుర్తింపు పొందిన వైద్యుడు అకాల మరణం చెందడంతో పట్టణంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
వివాదాలే కారణమా?
స్థానికులు మరియు మృతుని సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ శశిధర్ రెడ్డికి, నర్సంపేటలోని ఒక ప్రముఖ విద్యా సంస్థ చైర్మన్‌కు మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. డాక్టర్ శశిధర్ రెడ్డి తన సొంత స్థలంలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనం విషయంలో ఈ గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. సదరు భవనం వాస్తు ప్రకారం లేదనే నెపంతో ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు వాగ్వాదాలు జరిగాయని సమాచారం.
ఈ క్రమంలోనే సదరు విద్యా సంస్థ చైర్మన్‌తో జరుగుతున్న నిరంతర ఘర్షణలు, ఒత్తిడి కారణంగా డాక్టర్ శశిధర్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఆ వేదనతోనే ఆయన మృతి చెంది ఉండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విషాదంలో కుటుంబం
మృతుడు శశిధర్ రెడ్డి స్వస్థలం హైదరాబాద్. ఆయన భార్య కూడా వైద్య రంగంలో ప్రముఖ స్త్రీ నిపుణురాలు (గైనకాలజిస్ట్) కాగా, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చేతికి అందొచ్చిన కొడుకు, సమాజానికి సేవ చేయాల్సిన వృత్తిలో ఉండి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం కుటుంబ సభ్యులను తీరని శోకంలో ముంచెత్తింది.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్నారు. మరణానికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు పేర్కొన్నారు.