గణపురం/మే12 (జర్నలిస్ట్ వార్త వార్త):
కాకతీయుల శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన గణపురం కోటగుళ్ల చెంత నిధి సెగ రేగింది. స్థానిక ఎర్రమ్మ ఆలయం వేదికగా ఆదివారం సాగిన రహస్య తవ్వకాలు మండలంలో తీవ్ర కలకలం సృష్టించాయి. అధికారుల పర్యవేక్షణ కరువైన వేళ శుభ్రత పేరుతో కొందరు వ్యక్తులు సాగించిన ఈ తవ్వకాలు గుప్తనిధుల వేట కోసమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడాన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తులు, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఎర్రమ్మ ఆలయ పరిసరాల్లో భూమిని తవ్వడం ప్రారంభించారు. స్థానికులు ప్రశ్నించగా ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాం అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం. గతంలో ఈ ప్రాంతంలో భూగర్భం నుంచి బంగారు ఆభరణాలు, నాణేలు లభ్యమయ్యాయన్న ప్రచారం ఉండటంతో, పథకం ప్రకారమే ఈ తవ్వకాలు జరిపినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చారిత్రక సంపదను కాపాడాల్సిన పురావస్తు శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఈ ఘటనపై ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్లెదుటే అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక మర్మమేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గణపురం కోటగుళ్ల ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తరుణంలో, ఇలాంటి ఘటనలు జరగడం చారిత్రక ప్రేమికులను కలవరపెడుతోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, ఎర్రమ్మ ఆలయ పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయాలని, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.