పారానీ ఆరకముందే విషాదం నవవరుడు ఆత్మహత్య

journalist vaartha
By -
తొర్రూర్/మే 16(జర్నలిస్ట్ వార్త);పెళ్లయిన మూడు రోజులకే నవవరుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. తొర్రూర్ మండలం కర్కాల గ్రామానికి చెందిన సంకినేని సుధాకర్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలైన బిర్రు హైమావతిని ఈ నెల 13న వివాహం చేసుకున్నాడు. 14వ తేదీన కర్కాలలో వివాహ వేడుకలు ముగిశాయి. శుక్రవారం (15వ తేదీన) నల్లబెల్లిలో జరిగిన మరుల పెళ్లి వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపారు.
అయితే, శనివారం ఉదయం సధాకర్ అనూహ్యంగా  ఒక చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. పెళ్లయిన కొద్దిరోజులకే వరుడు ఆత్మహత్యకు పాల్పడటంతో కర్కాల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న తొర్రూర్ ఎస్సై షేక్ ఖాదర్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సధాకర్ మృతికి గల కారణాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.