మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సారంగపాణి.

journalist vaartha
By -
వర్ధన్నపేట/ మే 24:(జర్నలిస్ట్ వార్త);
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేశామని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమృత్ 2.0 పథకం ద్వారా చేపడుతున్న ఇంటింటికీ పైప్‌లైన్ మంచినీటి సరఫరా పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని 2వ వార్డు పరిధిలో గల ఎం.డి. అప్సర్ నివాసం వద్ద టెస్టింగ్ పద్ధతిలో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీటిని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ ద్వారా వస్తున్న నీటి ఒత్తిడి (ప్రెషర్), సరఫరా విధానం మరియు నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఆశయమని ఈ సందర్భంగా చైర్మన్ పేర్కొన్నారు.
మిగిలిన పైప్‌లైన్ పనులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసి, త్వరలోనే పూర్తి స్థాయిలో నీటి సరఫరాను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బెజ్జం పాపరావు, స్థానిక నాయకుడు ఎం.డి. అప్సర్, మున్సిపల్ సిబ్బంది , వార్డు ప్రజలు పాల్గొన్నారు.