బయ్యారం/,మే 24.(జర్నలిస్ట్ వార్త);
వరి కోతలు ముగిసిన తర్వాత పొలాల్లో మిగిలిపోయే వరి, మొక్కజొన్న కొయ్యలను, గడ్డిని దహనం చేయడం వల్ల భూమికి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది.కొంతమంది రైతులు అవగాహన లేమితో చేస్తున్న ఈ చిన్న పొరపాటు భవిష్యత్తులో పెద్ద నష్టాలకు దారితీస్తుంది.పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల మట్టిలోని తేమ మొత్తం ఆవిరి అయిపోతుందని తెలిపారు. భూమికి అవసరమైన సేంద్రీయ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మంటల్లో కాలిపోయి వృధాగా ఆవిరైపోతాయి. మంటల వేడికి భూమి పై పొరల్లో ఉండి పంటకు మేలు చేసే ఎన్నో సూక్ష్మజీవులు, వానపాములు మరణిస్తాయి. పొలాల్లో తిరిగే పాములు, ముంగిసలు, ఉడుములు వంటి పర్యావరణానికి మేలు చేసే జీవరాశులు సైతం కాలి బూడిదవుతాయి. దీంతో నేల గట్టిపడి తదుపరి పంట వేయడానికి భూమిని దున్నడం కష్టమవుతుంది, వరి మాగిళ్ళను కాల్చడం వల్ల విపరీతమైన పొగ, బూడిద గాల్లో కలిసి వాయు కాలుష్యం పెరుగుతుంది. ఈ కాలుష్యం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులకు ఊపిరితిత్తుల సమస్యలు, అస్తమా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.అంతేకాకుండా పక్క పొలాల్లోని పంటలకు మంటలు వ్యాపించి పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.రైతులు వరి, మొక్కజొన్న కోయలను కాల్చకుండా వ్యవసాయ యంత్రాలతో వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ రోటవేటర్ లేదా కేజీవిల్ చక్రాలతో కలియదున్నాలి. దీనికి ఎకరాకు 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ట్ లేదా వేస్ట్ డీకంపోజర్ ను వాడితే రెండు మూడు వారాల్లో వరికోయలు కుళ్లిపోయి ఎకరానికి దాదాపు టన్ను వరకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. దీనివల్ల తదుపరి పంట దిగుబడి 5 నుండి 10% వరకు పెరిగే అవకాశం ఉంది. వరి, మొక్కజొన్న కోయలను పొలాల్లో తగలబెట్టడం చట్టరీత్యా నేరం.అలా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశముంది.కాబట్టి రైతులు మొక్కజొన్న,వరి కోయలను కాల్చడం మానేసి భూమిలో కలియ దున్ని భూసారాన్ని పెంచుకోవాలి. రైతులందరూ పంట వ్యర్ధాలను కాల్చి వేయకుండా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు భూమాతను రక్షించుకునేందుకు ముందుకు రావాలని సీఐ అన్నారు.