ఢిల్లీకి మంద కృష్ణ మాదిగ ప్రయాణం జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్‌తో భేటీ కానున్న ఎమ్మార్పీఎస్ అధినేత

journalist vaartha
By -
సికింద్రాబాద్/మే 24(జర్నలిస్ట్ వార్త);
దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్‌ను కలవడానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. క్రైస్తవ మతంలోకి మారిన దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని వివరించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించి, రిజర్వేషన్ల ప్రయోజనాలు అందించాలని ఆయన కమిషన్‌ను కోరనున్నారు. అలాగే క్రైస్తవ మతంలో దళితులు ఎదుర్కొంటున్న వివిధ అంతర్గత సమస్యలు, వివక్షపై కమిషన్ ఛైర్మన్‌కు ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించనున్నారు. దళిత క్రైస్తవుల సుదీర్ఘకాల డిమాండ్లకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. మంద కృష్ణ మాదిగ దిల్లీ పర్యటనపై దళిత క్రైస్తవ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.