ఎండ తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలివృద్ధులు, చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం దళిత రత్నా అవార్డు గ్రహీత,ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ పిలుపు

journalist vaartha
By -
వరంగల్/ మే 25 (జర్నలిస్ట్ వార్త):
రాబోయే నాలుగు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని దళిత రత్నా అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒక ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాహం వేయకపోయినా సరే.. ప్రజలు తరచూ మంచి నీరు తాగాలని, దాంతో పాటు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
వేసవి కాలంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకు గుడ్డ కట్టుకుని లేదా గొడుగుతో మాత్రమే బయటకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఎండ వేళల్లో చిన్నపిల్లలను బయట ఆడనివ్వకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. ప్రజలు తమ ఆరోగ్య భద్రతపై ముందస్తుగా అప్రమత్తంగా ఉంటేనే వడదెబ్బ వంటి ముప్పుల నుంచి రక్షణ పొందవచ్చని బిర్రు మహేందర్ మాదిగ ఈ సందర్భంగా పేర్కొన్నారు.