మాట ఇచ్చాడు.. నీళ్లు ఇచ్చాడు..!రాళ్లవాగు తండాలో తాగునీటి సమస్యకు చెక్ఎన్నికల హామీల అమలులో సర్పంచ్ శంకర్ నాయక్ ముందంజబోర్ల ఫ్లషింగ్‌, కొత్త మోటర్ల ఏర్పాటుతో గ్రామస్తుల్లో ఆనందం

journalist vaartha
By -
 దామరచర్ల/మే 24 (జర్నలిస్ట్ వార్త);
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గ్రామాభివృద్ధిలో ముందుకు సాగుతున్న నాయకత్వానికి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండా ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామంలో ఎన్నో రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ దిరావత్ శంకర్ నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
గ్రామ ప్రజలకు ఎండాకాలంలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పాడైపోయిన బోర్లను ఫ్లషింగ్ చేయించడంతో పాటు, కొత్త మోటర్లను ఏర్పాటు చేయించారు. దీంతో తాగునీటి సరఫరా మెరుగుపడి గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొంతకాలంగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు, ఇప్పుడు సమస్య పరిష్కారం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
“ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. గ్రామంలో ప్రాథమిక సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత” అని సర్పంచ్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మధ్యే ఉంటున్న నాయకత్వం అరుదుగా కనిపిస్తోందని కొనియాడారు. తాగునీటి సమస్య పరిష్కారంతో మహిళలకు, ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సందీప్ నాయక్, యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.