ఎల్కతుర్తి/మే 24( జర్నలిస్ట్ వార్త);
ఇల్లు కోల్పోయిన బాధ.. పెరిగిన ఆర్థిక ఇబ్బందులు.. ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన.. చివరకు ఓ వికలాంగుడి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని వల్లపూర్ గ్రామానికి చెందిన అంబాల మధు (44) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మధు వికలాంగుడైనా రోజూ కూలి పనులు చేస్తూ చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండగా, ఇటీవల ఎన్‌హెచ్–269 రహదారి విస్తరణలో తమ ఇల్లు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. “ఇల్లు లేకపోయింది.. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో” అంటూ తరచూ ఆవేదన వ్యక్తం చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నెల 17న మధ్యాహ్నం సమయంలో మధు గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్‌లో హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్సై నరసింహారావు తెలిపారు.