పర్వతగిరి/మే8(జర్నలిస్ట్ వార్త):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దళిత రత్న అవార్డుకు ఎంపిక చేసిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బిర్రు మహేందర్ మాదిగకు పర్వతగిరి మండలంలోని ఏనిగల్లు గ్రామంలో ఘనంగా సన్మానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు మాసాని సువార్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహేందర్, సునిత
మాదిగలను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాసాని సువార్త మాట్లాడుతూ సామాన్య గ్రామీణ కుటుంబంలో జన్మించిన మహేందర్ మాదిగ, దశాబ్ద కాలంగా అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సారధ్యంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని, ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డు ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
సన్మాన గ్రహీత బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడుతూ దళిత రత్న అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఈ పురస్కారాన్ని అణగారిన వర్గాల పోరాటాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో సాగే ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులకు తక్షణమే ఎస్సీ హోదా కల్పించాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహేందర్ మాదిగకు శుభాకాంక్షలు తెలియజేశారు.