ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, జూన్ 15(జర్నలిస్టు వార్త):
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మసాగర్‌లో నిర్వహించిన మెగా వైద్య, రక్తదాన శిబిరం విశేష స్పందన పొందింది. గంగారపు ఆదాము శాంతమ్మ ఫౌండేషన్ (జి.ఏ.ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలో, ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికేర్ జనరల్ హాస్పిటల్ సహకారంతో పునీత అంతోని దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఈ శిబిరాన్ని నిర్వహించారు.
శిబిరంలో 300 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పొందారు. ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు.
అదే సమయంలో 30 మందికి పైగా యువతీ యువకులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా విలువలను చాటుకున్నారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మెడికేర్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ ఫాదర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసూతి సమయంలో రక్తం అత్యంత అవసరమవుతుందని తెలిపారు.
జి.ఏ.ఎస్.ఎఫ్ వ్యవస్థాపక చైర్మన్ గంగారపు అజయ్ ఆదాము మాట్లాడుతూ, తమ తండ్రి జ్ఞాపకార్థం ఫౌండేషన్‌ను స్థాపించి ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఆరోగ్య, విద్యా, సామాజిక రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.