ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను మింగేసే ప్రయత్నమా?గోపి నగర్" బోర్డుపై ధర్మసాగర్‌లో దుమారంఅనుమతులు ఉన్నాయా?.. గ్రామస్తుల ప్రశ్నల వర్షం

journalist vaartha
By -
ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరోజూన్ 16 (జర్నలిస్ట్ వార్త):హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కొత్తగా వెలిసిన "గోపి నగర్" బోర్డు వివాదానికి దారితీసింది. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ గోడ పక్కనే ఈ బోర్డు ఏర్పాటు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ గుర్తింపును కనుమరుగు చేసేలా బోర్డు ఏర్పాటు చేశారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు.
గ్రామంలో దశాబ్దాలుగా ఉన్న ఎస్సీ కాలనీ ప్రాంతానికి అకస్మాత్తుగా "గోపి నగర్" పేరు ఎలా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ బోర్డు ఏర్పాటు కోసం గ్రామపంచాయతీ అనుమతి తీసుకున్నారా? సంబంధిత అధికారుల ఆమోదం ఉందా? లేక కొందరు వ్యక్తులు స్వేచ్ఛగా ఏర్పాటు చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా స్థలాలు, ప్రభుత్వ భవనాల పరిసరాల్లో పేర్లు మార్చడం లేదా కొత్త బోర్డులు ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదని, ఇందుకు అధికారిక అనుమతులు తప్పనిసరిగా ఉండాలని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గ్రామ చరిత్ర, గుర్తింపుతో ముడిపడి ఉన్న ప్రాంతాలకు ఇష్టానుసారంగా పేర్లు పెట్టడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు.
గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ వ్యవహారంపై స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు ఏర్పాటు చేసి ఉంటే వెంటనే తొలగించాలని, లేదంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం "గోపి నగర్" బోర్డు ధర్మసాగర్‌లో చర్చనీయాంశంగా మారింది.