ధర్మసాగర్ ప్రజల కల నెరవేరు.. కొత్త బస్సు సర్వీసులకు శ్రీకారం

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూన్ 17 (జర్నలిస్ట్ వార్త): రవాణా సౌకర్యం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ధర్మసాగర్ మండల ప్రజలకు ఊరటనిచ్చేలా కొత్త బస్సు సర్వీసులు బుధవారం ప్రారంభమయ్యాయి. ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా ఆధ్వర్యంలో బస్సులను ఘనంగా ప్రారంభించారు.
ధర్మసాగర్ నుంచి ఉనికిచెర్ల, లంబాడి తండా, వడ్డేపల్లి మీదుగా హనుమకొండ బస్టాండ్ వరకు ఈ బస్సు సర్వీసులు నడవనున్నాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, వైద్య సేవల కోసం హనుమకొండకు వెళ్లే ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఈ సందర్భంగా సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా మాట్లాడుతూ.. మండల ప్రజల విజ్ఞప్తి మేరకు రవాణా సమస్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ప్రత్యేకించి విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రోజువారీ పనుల నిమిత్తం పట్టణాలకు వెళ్లే ప్రజలకు ఈ బస్సు సర్వీసులు వరంగా మారనున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.