ప్రమాదం పొంచి ఉన్నా పట్టని విద్యుత్ శాఖ..!కరెంట్ ప్రవహిస్తున్న పాత ఇనుప పోల్‌తో ప్రాణభయంఫిర్యాదులు చేసినా స్పందన శూన్యం.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

journalist vaartha
By -

ఎల్కతుర్తి,/జూన్ 7 (జర్నలిస్ట్ వార్త):
ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ పోల్‌ను తొలగించాలని గ్రామస్తులు వేడుకుంటున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలో ఉడుత సూర్యనారాయణ ఇంటి ముందు దశాబ్దాల నాటి ఇనుప విద్యుత్ పోల్ ప్రమాదకర స్థితిలో ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్థుల కథనం ప్రకారం సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఇనుప పోల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ అదే పోల్ ద్వారా విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ లీకేజీ లేదా పోల్ కూలిపోవడం వంటి ప్రమాదాల అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని బాధితుడు ఉడుత సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పోల్‌ను మార్చేందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంబాల గౌతం మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పాత ఇనుప స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వల్భాపూర్‌లో మాత్రం అధికారులు కళ్లు మూసుకున్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రామ విద్యుత్ సిబ్బంది, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడం వల్లే సమస్యలు పేరుకుపోతున్నాయని ఆయన అన్నారు. వెంటనే పాత ఇనుప పోల్‌ను తొలగించి కొత్త సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని, లేకపోతే గ్రామస్తులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
"ప్రాణాలు పోయాక స్పందిస్తారా..?" అంటూ గ్రామస్తులు విద్యుత్ శాఖ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.