ధర్మసాగర్,/ హనుమకొండ బ్యూరోజూన్ 28 (జర్నలిస్ట్ వార్త): దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందుకు నడిపించిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు సేవలు చిరస్మరణీయమని ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటుపల్లి రేణుక వెంకట్ అన్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నేలపై జన్మించిన పీవీ నరసింహారావు అపర చాణక్యుడిగా, బహుభాషా కోవిదుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు బలమైన రాజ్యాంగ హోదా కల్పించి సామాన్య ప్రజలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించిన మహానీయుడని తెలిపారు. పీవీ చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ చామల రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు శ్యామల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గొల్లపల్లి వెంకట్రాజం, కాంగ్రెస్ నాయకులు వేములకొండ భిక్షపతి, మాటూరి సదానందం, ఆశా కార్యకర్తలు జ్యోతి, రాణి, వసుమతి, జయ తదితరులు పాల్గొన్నారు.