వర్ధన్నపేట/జూన్ 28 (జర్నలిస్ట్ వార్త): ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి పిలుపునిచ్చారు. ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సందర్శించిన ఆయన, 12వ వార్డు కౌన్సిలర్ తిరుపెల్లి వాణితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని ఇతర పోలియో కేంద్రాల్లోనూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నీలగిరి స్వామి తండాలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి, ఆర్‌టీసీ బస్టాండ్ కేంద్రంలో మొదటి వార్డు కౌన్సిలర్ బెజ్జం పాపరావు, భవానీకుంట తండాలో నాలుగో వార్డు కౌన్సిలర్ నునావత్ కమిలి, డి.సి. తండా ప్రభుత్వ పాఠశాలలో వార్డు కౌన్సిలర్ మాలోతు దేవేందర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.కార్యక్రమంలో ఏఎన్‌ఎం మంజుల, ఆశా కార్యకర్తలు రమ, కళ్యాణి, అంగన్‌వాడీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తిరుపెల్లి కుమారస్వామి, బక్కతట్ల రాజు, వేంకన్న, పూజారి శ్రీనివాస్, బచ్చు గంగాధర్‌రావు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు.
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలివర్ధన్నపేటలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
By -
June 27, 2026