దేవాదులతోనే వరంగల్ రైతుకు భరోసా15 రోజుల్లో కాలువలకు నీరు.. నెల రోజులపాటు నిరంతర పంపింగ్వర్షాభావంలో రైతులు 'ఆన్-ఆఫ్' సాగు పాటించాలి: కడియం శ్రీహరి

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో జూలై 12 (జర్నలిస్ట్ వార్త): వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి దేవాదుల ఎత్తిపోతల పథకమే అండగా నిలుస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగ ర్రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల పంపింగ్‌ను ఆదివారం పరిశీలించిన ఆయన, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2003లో తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన దేవాదుల ఎత్తిపోతల పథకం నేడు మహావృక్షంగా ఎదిగి ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్న వరప్రదాయినిగా మారిందన్నారు. ప్రాజెక్టు రూపకల్పన నుంచి పూర్తిస్థాయిలో అమలు దశ వరకు ప్రత్యక్షంగా భాగస్వామి కావడం తన రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన ఘట్టమని పేర్కొన్నారు.రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వరి సాగు తప్పనిసరి అయితే "ఆన్-ఆఫ్" విధానాన్ని అనుసరించాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.నేటి నుంచి నెల రోజులపాటు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని అన్ని దశల్లో నిరంతరాయంగా పంపింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వ్యవధిలో ధర్మసాగర్, స్టేషన్ ఘనపూర్, నవాబ్‌పేట, అశ్వరావుపల్లి, చిటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసి, ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు వివరించారు.దేవాదుల ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు.
కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సుధీర్, ఎస్‌ఈ సీతారాం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.