ఉనికిచెర్లకు రూ.5 కోట్ల అభివృద్ధి వరంఫోర్‌లేన్ రోడ్డు, సీసీ రోడ్లు, శ్మశానవాటిక పనులకు శ్రీకారంఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

journalist vaartha
By -
ధర్మసాగర్,/హనుమకొండ బ్యూరో జూలై 23 (జర్నలిస్ట్ వార్త): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచెర్ల గ్రామానికి రూ.5 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు వరించాయి. ఫోర్‌లేన్ రహదారి, శ్మశానవాటిక అభివృద్ధి, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే గ్రామంలో ఎస్సీ కుటుంబాలకు పక్కా ఇళ్లు, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, తాగునీటి సౌకర్యాలు, ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అనంతరం రెండు దశాబ్దాల పాటు గ్రామాభివృద్ధి ఆశించిన స్థాయిలో సాగలేదని పేర్కొన్నారు. తిరిగి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉనికిచెర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే రూ.1.50 కోట్లతో పలు పనులు చేపట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
శ్మశానవాటికకు ఆధునిక హంగులు
గ్రామ శ్మశానవాటిక అభివృద్ధికి సుమారు రూ.50 లక్షలు వెచ్చించి ప్రహరీ గోడ, దహన వేదికలు, బోర్‌వెల్‌, ఓవర్‌హెడ్ ట్యాంక్‌, స్నాన సదుపాయాలు, దుస్తులు మార్చుకునే గదులు, రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
రూ.2 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి
జాతీయ రహదారి–163 నుంచి ఉనికిచెర్ల గ్రామ జంక్షన్ వరకు రూ.2 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే మరో రూ.1 కోటి మంజూరు చేసి డివైడర్‌, సెంట్రల్ లైటింగ్‌, సైడ్ డ్రైన్లతో ఆధునిక రహదారిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
గల్లీలన్నింటికీ సీసీ రోడ్లు
గ్రామంలోని మిగిలిన వీధులు, గల్లీల్లో 1,150 మీటర్ల మేర రూ.2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రధాన డ్రైన్ నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మహిళా సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు
మహిళా సంఘాలు, మున్నూరు కాపు సంఘం కోసం ప్రత్యేక కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎంపీ సహకారంతో ఈ పనులను చేపడతామని చెప్పారు.
సంక్షేమానికీ సమాన ప్రాధాన్యం
అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుపైనా ప్రభుత్వం సమాన దృష్టి సారిస్తోందని కడియం శ్రీహరి అన్నారు. తొలి విడతలో గ్రామానికి 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 20 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. రెండో విడతలోనూ అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో కలిపి ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఒకటని పేర్కొన్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గ్రామంలో మిగిలిన అభివృద్ధి పనులను కూడా దశలవారీగా పూర్తి చేసి జీడబ్ల్యూఎంసీ నిధులతో ఉనికిచెర్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 54 డివిజన్ కార్పొరేటర్ రాధిక రెడ్డి,ఎంపీడీవో అనిల్ కుమార్ తహశీల్దార్ బావ్ సింగ్ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు