సాగునీటి కాలువ కబ్జా.. చర్యలు తీసుకోవాలని రైతుల వినతి

journalist vaartha
By -
వర్ధన్నపేట/జులై 22(జర్నలిస్ట్ వార్త);
మండలంలోని ఇల్లంద గ్రామ శివారులో ఉన్న ఊర చెరువు సాగునీటి కాలువను కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం రైతులు తాసిల్దార్ విజయ్‌సాగర్‌కు వినతిపత్రం అందజేశారు.ఊర చెరువు ఆయకట్టు కింద దాదాపు 8 ఫీట్ల వెడల్పు ఉన్న సాగునీటి కాలువను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కంచె వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ ఆక్రమణకు గురైతే పంటలకు సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి, కాలువ ద్వారా నీటి పారకం యథావిధిగా కొనసాగేలా చూసి తమకు న్యాయం చేయాలని కోరారు. వినతిపత్రం స్వీకరించిన తాసిల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.