వేలేరు/జూలై 22 (జర్నలిస్ట్ వార్త): వేలేరు మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గండి రామారం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గోదావరి జలాలతో మండల రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.బుధవారం మద్దెలగూడెం, వేలేరు మండల కేంద్రాల్లో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వేలేరు మండల కేంద్రంలో నెల రోజుల్లో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తహసీల్దార్ కార్యాలయానికి రూ.2.20 కోట్లు, ఎంపీడీవో కార్యాలయానికి రూ.2 కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు.గండి రామారం ఎత్తిపోతల పథకం పూర్తయితే వేలేరు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని, రైతుల భవిష్యత్తు మారుతుందని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, అయితే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండున్నరేళ్లలోనే కోట్ల రూపాయలతో రోడ్లు, భవనాలు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించామని చెప్పారు.
రూ.8 కోట్లతో వేలేరు–కొమ్ముగుట్ట డబుల్ రోడ్డు, రూ.4.50 కోట్లతో వేలేరు–శాలపల్లి బీటీ రోడ్డు, రూ.13 కోట్లతో హ్యామ్ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని, పది నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.మద్దెలగూడెం గ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, మరో 20 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
బీఆర్‌ఎస్ దోచుకుంది'రాజకీయాలపై స్పందించిన కడియం శ్రీహరి.. పదేళ్ల పాలనలో తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు అధికారం కోల్పోయి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి ద్వారా కూడబెట్టిన నిధులపై ఆ పార్టీ నాయకుల మధ్యే విభేదాలు బయటపడుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైనా వారి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులు, ప్రజలు బీఆర్‌ఎస్ ప్రచారాన్ని నమ్మవద్దని, సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.