గీసుగొండ/జులై 9(జర్నలిస్ట్ వార్త): లారీల రాకపోకలతో రోడ్డుపై పేరుకుపోయిన బురదను గీసుగొండ పోలీసులు తక్షణమే తొలగించి వాహనదారులకు ఊరట కల్పించారు. స్థానిక ఊకల్ క్రాస్ వద్ద లారీ అసోసియేషన్ పార్కింగ్ స్థలం నుండి లారీలు రావడం వల్ల వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారి మట్టిమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో గీసుగొండ సి ఐ విశ్వేశ్వర్, ఎస్ఐ అనిల్ సిబ్బందితో కలిసి స్పందించారు.
స్థానికులు, లారీ డ్రైవర్ల సహకారంతో పోలీసులు స్వయంగా రోడ్డుపై పేరుకుపోయిన బురదను పూర్తిగా తొలగించి రహదారిని శుభ్రం చేయించారు. పోలీసుల ముందస్తు జాగ్రత్తల వల్ల తృటిలో పెద్ద ప్రమాదాలు తప్పి, వాహనాల రాకపోకలు మళ్లీ సజావుగా సాగాయి. భవిష్యత్తులో పార్కింగ్ చేసేటప్పుడు మట్టి రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లారీ యజమానులకు పోలీసులు సూచించారు. రహదారులపై ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉంటే ప్రజలు వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.