చాకచక్యంగా ఇంటి దొంగతనం కేసు ఛేదింపు నిందితుడి అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం

journalist vaartha
By -
గీసుగొండ/ జూలై 11(జర్నలిస్ట్ వార్త): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థుడిని గీసుగొండ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం. శుక్రవారం (10-07-2026) రాత్రి పోలీసులు జాన్‌పాక గ్రామ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులను చూసి దాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి చెందిన నందిపాటి జార్జ్ అలియాస్ రమణయ్య (64)గా గుర్తించారు. వరంగల్ ఆదర్శ్ కాలనీలోని ఒక ఇంట్లో తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. అతని నుంచి ఒక గ్రాము బంగారు ఉంగరం, 50 గ్రాముల వెండి కాళ్లపట్టీలను స్వాధీనం చేసుకుని, నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.