ఉప్పరపల్లిలో టెన్షన్ టెన్షన్.. పోలీస్ దిగ్బంధంలో గ్రామంఉదయం నుంచే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నాగ్రామ కూడలిలో నిరసన జ్వాలలుమృతదేహం రాక ముందే భారీగా చేరిన పోలీస్ బలగాలు

journalist vaartha
By -

వర్ధన్నపేట/ జులై 16 (జర్నలిస్ట్ వార్త): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉపరపెల్లి గ్రామంలో 
కుల పరువు హత్యకు గురైన రాజు మృతితో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత మరింత రాజుకుంది. బుధవారం ఉదయం నుంచే గ్రామంలోని ప్రధాన కూడలి లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రజా సంఘాలు, దళిత నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి బాధితుల వైపు బలంగా నిలబడ్డారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
మరోవైపు రాజు మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉండటంతో ఉదయం నుంచి పోలీసులు నెమ్మదిగా బలగాలను మోహరించడం ప్రారంభించారు. సమయం గడుస్తున్న కొద్దీ ఉప్పరపల్లిని పోలీస్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మృతదేహం రాకతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఉన్నతాధికారులు ఇక్కడ భారీగా పోలీస్ ఫోర్స్ మోహరించినట్లు స్థానికంగా పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనల నడుమ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.