ఖాజీపేట/హనుమకొండ, బ్యూరో జూలై 19 (జర్నలిస్ట్ వార్త): కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి, కోచ్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ నాయకుడు బైరపాక ప్రభాకర్ హెచ్చరించారు. తెలంగాణ రైల్వే జేఏసీ, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం మడికొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన శాంతియుత పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే కాజీపేటలో రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ కోసం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు సాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 43 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించగా, అప్పటి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు లిఖితపూర్వక హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం రైల్వే జేఏసీ, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఉమ్మడి పోరాట ఫలితంగానే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు.
అయితే కోచ్ ఫ్యాక్టరీ కోసం అయోధ్యపురం, కుమ్మరిగూడెం గ్రామాల రైతులు భూములు కోల్పోయినా, వారి కుటుంబాలకు నేటికీ ఉద్యోగాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన కుటుంబాల పిల్లలకు కోచ్ ఫ్యాక్టరీలో ప్రాధాన్యత ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలని, కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు తమ ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ పాదయాత్రలో టీడీపీ వరంగల్ పార్లమెంట్ అడ్హాక్ కమిటీ సభ్యుడు బర్ల యాకోబ్, మాజీ కార్పొరేటర్ పిట్టల శ్రీనివాస్, హనుమకొండ సాంబయ్య, కాజీపేట మండల అధ్యక్షుడు కాలమాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.