వరంగల్/జూలై 19 (జర్నలిస్ట్ వార్త):
మామునూరును నూతన రెవెన్యూ మండల కేంద్రంగా ప్రకటించాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం ముగిశాయి. వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఉద్యమకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామునూరును మండల కేంద్రం చేయాలనే పట్టుదలతో సాధన సమితి నాయకులను తీసుకువెళ్లి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో మాట్లాడించామని, మంత్రి నుంచి సానుకూల హామీ లభించిందని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య కొలిక్కి రావడంతో గ్రామస్థులు, కమిటీ సభ్యులు నాగరాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం 48 గంటల పాటు నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే అభినందిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు అయూబ్, సాధన సమితి కన్వీనర్ ఎర్ర విజయ్, కో-కన్వీనర్లు మాచర్ల యాదగిరి, బండి సాంబయ్య యాదవ్, నల్లతీగల కోటేశ్వర్, నోముల ముత్తారెడ్డి, మన్నే ఓదెలు, సోషల్ మీడియా కన్వీనర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.