అధికార పక్షానికి దళితుల ఓట్లే తప్ప ప్రాణాలు పట్టవా? ఉప్పరపల్లి పరువు హత్యపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పాలకులుసంచలనం రేపిన భాస్కర్ హత్య.. పరామర్శకు నోచని దళిత కుటుంబంవర్ధన్నపేట ఎమ్మెల్యే వైఖరిపై వెల్లువెత్తుతున్న దళిత సంఘాల ఆగ్రహంబిఆర్‌ఎస్ పార్టీ వైఖరిపైనా దళితుల తీవ్ర అసంతృప్తి

journalist vaartha
By -
వర్ధన్నపేట/జూలై 17 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఉప్పరపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు చిన్నపిల్లి భాస్కర్  కుల పరువు హత్య స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. దళితులపై జరుగుతున్న ఇటువంటి అరాచకాల పట్ల అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరిపై నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కిరాతకంగా ఒక దళిత యువకుడిని హత్య చేస్తే. కనీసం మానవతా దృక్పథంతో బాధితులను పరామర్శించే తీరిక కూడా స్థానిక ప్రజాప్రతినిధులకు, పాలకులకు లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే గారూ.. దళిత నియోజకవర్గంపై ఈ నిర్లక్ష్యమెందుకు?
వర్ధన్నపేట ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడం గమనార్హం. ఒక దళిత ఎమ్మెల్యేగా ఉంటూ, తన సొంత నియోజకవర్గంలో ఇంతటి ఘోరం జరిగితే కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పకపోవడం విడ్డూరంగా మారింది. రాజకీయాల్లో ఓట్ల కోసం దళితుల ముంగిటకు వచ్చే నాయకులకు, అదే దళితుడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే కనీస బాధ్యత లేదా? అని దళిత సంఘాల నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గ రక్షకుడిగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దళిత సమాజాన్ని అవమానించడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్‌లో దళిత నేతలు లేరా.. ఉన్నా నోళ్లు పెగలవా?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి కూడా ఈ ఘటనలో తీవ్ర విమర్శలపాలవుతోంది. అసలు బాధిత కుటుంబంతో తమకేమీ సంబంధం లేనట్లుగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో దళిత నాయకులే లేరా? ఒకవేళ ఉంటే, ఆ బీదరికంలో ఉన్న దళిత కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే సాహసం ఎందుకు చేయడం లేదు? పార్టీ అధిష్ఠానం వద్ద తమ పదవులు ఊడిపోతాయన్న భయమా, లేక సాటి సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం కంటే రాజకీయ స్వార్థమే ముఖ్యమా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీదీ అదే బాట..
ఇక ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ (టిఆర్ఎస్) పార్టీ సైతం ఈ విషయంలో దళితుల ఆగ్రహానికి గురవుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే దళిత సామాజిక వర్గానికి చెందినవారే అయినప్పటికీ, సదరు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఎవరూ ఇప్పటివరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం గమనార్హం. అధికారం ఉన్నా లేకపోయినా దళితులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.
ఓట్ల కోసమేనా ఈ రాజకీయాలు?
దళితులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా.చివరికి అధికార పక్షంలో ఉన్నా. వారికి ఆపద వస్తే పరామర్శించే దిక్కు లేని దౌర్భాగ్య స్థితిలో నేటి సమాజం ఉంది అనడానికి ఉప్పరపల్లి
 ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నికల వేళ దళితులను నెత్తిన పెట్టుకునే రాజకీయ పార్టీలు, అధికారం దక్కాక వారి రక్తం ఏరై పారుతున్నా కిమ్మనకుండా కూర్చోవడం ఎటువైపు దారితీస్తోంది?
అత్యంత కిరాతకంగా చంపబడిన భాస్కర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాటం ఆపేది లేదని దళిత సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు, ప్రజాప్రతినిధులు తమ నిమ్మకు నీరెత్తిన వైఖరిని వీడి, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించి, భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.