వర్ధన్నపేట/ జూలై 16 (జర్నలిస్ట్ వార్త):
కులం తక్కువవాడంటూ హెచ్చరించినా వినకుండా తన కుమార్తెను ప్రేమించాడన్న కక్షతో ఒక దళిత యువకుడిని కిరాతకంగా హతమార్చిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే. గ్రామానికి చెందిన దళిత (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన శీనపల్లి భాస్కర్, యాదవ కులానికి చెందిన తమ్మడబోయిన రాజు కుమార్తె నికిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రాజు. భాస్కర్ తక్కువ కులం వాడంటూ కుమార్తెను తీవ్రంగా మందలించాడు. అయినా ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. చివరకు హైదరాబాద్‌లోని మాదాపూర్ హోటల్‌లో పనిచేస్తున్న భాస్కర్‌ను హతమార్చేందుకు రాజు తన అనుచరులతో కలిసి పథకం వేశాడు. పక్కా స్కెచ్‌తో భాస్కర్‌ను దారుణంగా హత్య చేశాడు.
పోలీస్ నిర్లక్ష్యంపై మాదిగ’ జనం ఆగ్రహం
ఈ అమానుష పరువు హత్య వార్త తెలియడంతో ఉప్పరపల్లి ఉలిక్కిపడింది. ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి శీనపల్లి రాజు ఆధ్వర్యంలో గురువారం ఉదయం గ్రామస్థులు, దళిత సంఘాలు ఉప్పరపల్లిలో భారీ నిరసన ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ ధర్నాకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిందితుడు తమ్మడబోయిన రాజుకు సహకరించిన ప్రత్యక్ష, పరోక్ష శక్తులన్నింటిపై పీడీ యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కేసు విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వీడి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూడాలి. హతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గోలి సుధాకర్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు ముత్యాల మల్లేష్ మాదిగ, ఉపాధ్యక్షుడు చాడ కరుణాకర్ మాదిగ, భారీ సంఖ్యలో గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.