దేవాదుల పంపులు పూర్తిస్థాయిలో నడపాలిధర్మసాగర్‌ మండలానికి కేటాయించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలికడియం శ్రీహరిపై రాజయ్య ధ్వజం

journalist vaartha
By -
ధర్మసాగర్/హనుమకొండ బ్యూరో, జూలై 19 (జర్నలిస్ట్ వార్త): దేవాదుల ఎత్తిపోతల పథకం పంపులు, మోటార్లను పూర్తిస్థాయిలో నడిపి స్టేషన్ గణపురం ఆయకట్టులోని 1.53 లక్షల ఎకరాలకు సాగునీరు, స్థిరీకరణ నీరు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ధర్మసాగర్‌కు కేటాయించిన నిధుల వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఆదివారం ధర్మసాగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ధర్మసాగర్ ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల శాఖ అధికారులు ధర్మసాగర్ పంపుల నుంచి పాత పైప్‌లైన్ వరకు మొత్తం కాల్వ మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడితే కాల్వల్లో ఉన్న లోపాలు వెలుగులోకి వచ్చి వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.గత ఏడాది భారీ వర్షాల సమయంలో సరైన ప్రణాళిక లేకుండా ధర్మసాగర్ చెరువు గేట్లను ఒక్కసారిగా ఎత్తివేయడంతో దేవునూరు, సోమదేవరపల్లి తదితర గ్రామాల్లో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఆ సమయంలో బాధిత రైతులను ప్రజాప్రతినిధులు పరామర్శించలేదని విమర్శించారు. రైతుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులకు సూచించారు.మేడిగడ్డ, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల్లో తగినంత నీరు, విద్యుత్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని పేర్కొంటూ, దేవాదుల పంపులు, మోటార్లను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. ధర్మసాగర్ అభివృద్ధి, సాగునీటి సమస్యల పరిష్కారంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ధర్మసాగర్‌కు కేటాయించిన నిధులు ఎంత? వాటితో చేపట్టిన అభివృద్ధి పనులు ఏమిటి? అనే వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బీఎల్‌వోలకు పూర్తి సహకారం అందించి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ధర్మసాగర్ మండల ఇన్‌చార్జి కర్ర సోమిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు ప్రతాప్, మాచర్ల సుదర్శన్, బొక్క దయాకర్, దంతూరి బాలరాజ్, బొడ్డు రమణాకర్ తదితరులు పాల్గొన్నారు.