గ్రామాభివృద్ధికి అధికారులు–సర్పంచుల సమన్వయం కీలకం మండల స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దిశానిర్దేశం

journalist vaartha
By -
హసన్‌పర్తి/ జూలై 30 (జర్నలిస్ట్ వార్త): గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. హసన్‌పర్తి ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అధికారులు పూల మొక్క అందించి స్వాగతం పలికారు.సమావేశంలో 16 కీలక అంశాలపై అధికారులతో, సర్పంచులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఎల్‌నీవో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు యువతలో చైతన్యం తీసుకువచ్చి మత్తు రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని, తడి–పొడి చెత్త వేర్వేరుగా సేకరించే విధానంపై గ్రామస్థులకు మరోసారి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సర్పంచులు, అధికారులు కలిసి ఉదయం వాకింగ్ కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి హరితహారాన్ని ఉద్యమంలా కొనసాగించాలని కోరారు. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశం అనంతరం పదవీ విరమణ పొందనున్న ఎంపీవో కరుణాకర్ రెడ్డిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శాలువాతో సన్మానించి, ప్రజా సేవలో ఆయన అందించిన సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శేషాద్రి, డీఆర్‌డీవో పీడీ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ మోహన్, మండల అధ్యక్షుడు అశోక్, ఆత్మకూరు మార్కెట్ వైస్‌చైర్మన్ తిరుపతి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాకేష్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ, ఎమ్మార్వో, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.