వర్ధన్నపేట/జూలై 19 (జర్నలిస్ట్ వార్త):
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ డివిజన్ కోనాపురం గ్రామంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి పర్యటించారు. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య (శానిటైజేషన్) పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మురుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ చర్యలను మున్సిపల్ సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పట్టణంలో పారిశుధ్య పనులను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది , వార్డు ప్రజలు పాల్గొన్నారు.