జర్నలిస్ట్ వార్త కథనంపై ఆసుపత్రి స్పందన సిబ్బందికి మెమోలు.. 24 గంటల్లో వివరణ

journalist vaartha
By -
వర్ధన్నపేట/సెప్టెంబరు 16 (జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట ప్రాంతీయ ఆసుపత్రిలో రోగికి చికిత్స ఆలస్యం, రోగి సహాయకులతో సిబ్బంది దురుసు ప్రవర్తనపై జర్నలిస్ట్ వార్త లో ప్రచురితమైన కథనంపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. ఘటనపై నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేసి, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాయపర్తి మండలం పెరికెడు గ్రామానికి చెందిన ఐ. సరస్వతి (25) జ్వరంతో సెప్టెంబరు 16న మధ్యాహ్నం 1.30 గంటలకు ఐపీ నంబర్ 5835తో ఆసుపత్రిలో చేరినట్లు మెమోలో పేర్కొన్నారు. రోగికి సుమారు 20 నిమిషాల పాటు చికిత్స అందలేదని, కేస్‌షీట్‌ను ఓపీ వద్ద నమోదు చేసి వార్డుకు పంపించారని రోగి సహాయకులు చేసిన ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్ వార్త కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో డ్యూటీ వైద్యుడు డాక్టర్ కె. రాజేష్, స్టాఫ్ నర్సులు కె. విజయ, ఎం. యకలక్ష్మి, చి. మంజులకు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మెమోలు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా, రోగి సహాయకులతో దురుసుగా వ్యవహరించారా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
మెమో అందిన 24 గంటల్లోగా వివరణ సమర్పించాలని, సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోకూడదో, ఉన్నతాధికారులకు ఎందుకు సిఫారసు చేయకూడదో కారణాలు వెల్లడించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెమో ప్రతులను వరంగల్ జిల్లా ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్‌తో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఆరోపణలపై విచారణ జరగనుండటంతో. సిబ్బంది ఇచ్చే వివరణ, అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.