వర్ధన్నపేట/సెప్టెంబరు 16 (జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట ప్రాంతీయ ఆసుపత్రిలో రోగికి చికిత్స ఆలస్యం, రోగి సహాయకులతో సిబ్బంది దురుసుగా వ్యవహరించారంటూ జర్నలిస్ట్ వార్త లో ప్రచురితమైన కథనంపై ఆసుపత్రి అధికారులు స్పందించారు. ఘటనకు సంబంధించి సిబ్బందికి మెమోలు జారీ చేసి, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన రోగికి సుమారు 20 నిమిషాల పాటు వైద్య సేవలు అందలేదని, కేస్‌షీట్‌ను ఓపీ వద్ద నమోదు చేసి వార్డుకు పంపించారని రోగి సహాయకులు ఫిర్యాదు చేసినట్లు అధికారిక మెమోలో పేర్కొన్నారు. అలాగే డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది రోగి సహాయకులతో దురుసుగా మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలపైనా వివరణ కోరారు.విధుల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? రోగి సహాయకులతో అనుచితంగా వ్యవహరించారా? అనే అంశాలపై సిబ్బంది వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోకూడదో, ఉన్నతాధికారులకు ఎందుకు సిఫారసు చేయకూడదో కారణాలు వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఈ మెమో ప్రతులను ఉన్నత వైద్యాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. కథనంపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం. ఆరోపణలపై వివరణ కోరడంతో తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.