వర్ధన్నపేట// సెప్టెంబరు 23 (జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యుడి వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ క్లినిక్కు పంపుతున్నారన్న ఆరోపణలతో పాటు ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ వైద్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణులను ప్రైవేట్ ఆస్పత్రికి మళ్లిస్తున్నారన్న ఫిర్యాదులపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.సదరు వైద్యుడు గతంలో అర్హతకు మించి డెలివరీలు, సర్జరీలు చేస్తున్నారన్న అభ్యంతరాలు వచ్చినట్లు ఆస్పత్రి వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పట్లో రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ ప్రముఖ వైద్యురాలు ఈ విషయంపై మందలించి, అర్హతకు మించిన వైద్యం చేయొద్దని సూచించినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో అంతర్గతంగా సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది.
కొద్ది నెలల క్రితం ఆస్పత్రిలోని ఓ స్వీపర్తో వ్యవహరించిన తీరుపైనా వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ ఘటనపై పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో కథనాలు వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. గతంలో బాలుడి మృతికి సంబంధించిన వైద్య ఘటనపైనా ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆ ఘటనలో వైద్యపరమైన తప్పిదం ఉందా లేదా అనేది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.ఇన్ని ఆరోపణల నేపథ్యంలో సదరు వైద్యుడికి ఇన్చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించడంపై ఆస్పత్రి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులు, రిఫరల్ వివరాలు, డ్యూటీ రిజిస్టర్లు, ప్రైవేట్ క్లినిక్ అనుమతులు, సంబంధిత వైద్య రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకుంటే అధికారికంగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.