రిపోర్టు తారుమారు.. బాధ్యత ఎవరిది?సేమ్‌ పేరుతో రోగి రిపోర్టు మరొకరికి.. అడిగితే మాకు సంబంధం లేదు .. గంటసేపు పడిగాపులు.. విలేకరి జోక్యంతో పరీక్షలు

journalist vaartha
By -
వర్ధన్నపేట/సెప్టెంబరు 30 (జర్నలిస్ట్ వార్త): వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరీక్షా రిపోర్టుల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం  సోమవారం ఓ రోగి రక్త నమూనా ఇచ్చిన అనంతరం తన రిపోర్టు కోసం ల్యాబ్‌కు వెళ్లగా. అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి రిపోర్టు ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించారు. నా రిపోర్టు వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు? అని ల్యాబ్‌ సిబ్బందిని ప్రశ్నించగా.మాకు సంబంధం లేదు. వారి పేరు కూడా అదే అంటూ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. మళ్లీ ఓపీ తీసుకుని వైద్యుడితో పరీక్షలు రాయించుకుని వస్తేనే రక్తం తీసుకుని పరీక్షలు చేస్తామని చెప్పడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో సుమారు గంటసేపు ల్యాబ్‌ బయట వేచి ఉన్నారు.
ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ వార్త విలేకరి అక్కడికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ల్యాబ్‌ సిబ్బందిని ప్రశ్నించగా.బాధితుడి ఓపీ చిట్టీ నంబరు పరిశీలించి, ల్యాబ్‌లో ఉన్న రక్త నమూనాను గుర్తించి అదే నమూనాతో పరీక్షలు నిర్వహించి రిపోర్టు అందించారు. దీంతో విలేకరి జోక్యంతో గంటల తరబడి ఎదురైన సమస్యకు పరిష్కారం లభించింది.రోజుకు 400 మందికిపైగా ఓపీ వస్తుండటంతో రోగుల పూర్తి వివరాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఒకే పేరు ఉన్న రోగులను గుర్తించేందుకు ఊరు, ఫోన్‌ నంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలని ఓపీ కౌంటర్‌కు సూచించినట్లు ల్యాబ్‌ సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే ఒకరి రక్త నమూనాకు మరొకరి రిపోర్టు చేరకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ వీరియన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ భారత్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రామమూర్తి పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఇలాంటి సమస్యలు తలెత్తడంపై ఆసుపత్రి పర్యవేక్షణ తీరుపై రోగులు ప్రశ్నిస్తున్నారు. రోగులతో సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉంటే వాటిపైనా అధికారులు విచారణ జరపాలని కోరుతున్నారు.
రక్త పరీక్ష రిపోర్టు తారుమారైతే అది సాధారణ పొరపాటు కాదు. రోగి చికిత్సపైనే ప్రభావం చూపే అంశం. ఓపీ నమోదు నుంచి నమూనా సేకరణ, పరీక్ష, రిపోర్టు జారీ వరకు ప్రతి దశలో వివరాలను ధ్రువీకరించే పద్ధతిని అమలు చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యతను నిర్ధారించాలని రోగులు కోరుతున్నారు. జిల్లా అధికారులు తక్షణం దృష్టిసారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.